ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 99 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్ వెయ్యి పరుగులు సాధించాడు.
దీంతో సచిన్ రికార్డును రుతురాజ్ గైక్వాడ్ సమం చేశాడు. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ సైతం ఐపీఎల్ కెరీర్‌లో 31 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగుల ఘనత అందుకున్నాడు. అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 10 కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలను చేసిన భారత ఆటగాడినూ నిలిచాడు. 31 ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ 10 హాఫ్ సెంచరీలు చేయగా.. 38 ఇన్నింగ్స్‌లలో సచిన్, 40 ఇన్నింగ్స్‌లలో శ్రేయస్ అయ్యర్ 10 హాఫ్ సెంచరీలు చేశారు. కాగా ఓవరాల్ ఐపీఎల్‌లో 31 ఇన్నింగ్స్‌లు ఆడి ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లలో రుతురాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 31 ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ గైక్వాడ్ 1076 పరుగులు చేశాడు. సచిన్ 1064 పరుగులు, దేవదత్ పడిక్కల్ 932, సురేశ్ రైనా 928, గౌతం గంభీర్ 901 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.