ఐపీఎల్ టోర్నమెంట్ ముగియడంతో.. ఇప్పుడు అందరి దృష్టి సౌతాఫ్రికా, భారత్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే మాజీలందరూ ఈ సిరీస్‌పై తమతమ అంచనాల్ని వెల్లడించడం మొదలుపెట్టారు. ఏ జట్టు సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది? టీమిండియాలో ఎవరు బాగా రాణించగలరు? ఎవరెవరు ఏయే స్థానాల్లో దిగితే బాగుంటుంది? అనే విషయాలపై తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలను 5, 6వ స్థానాల్లో పంపితే.. చివరి ఆరు ఓవర్లలో వాళ్ళు 120 పరుగుల వరకూ సాధించగలరని పేర్కొన్నారు.
‘‘హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లు విధ్వంసకరమైన బ్యాట్స్మన్లు. వాళ్ళిద్దరు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. చివరి ఆరు ఓవర్లలో వీళ్లిద్దరు విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసి, భారీ భాగస్వామ్యాన్ని జోడింగలరు. కనీసం 100 నుంచి 120 పరుగులు వారి నుంచి ఆశించొచ్చు. కాబట్టి.. వారిని 5, 6వ స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని నేను కోరుకుంటున్నా’’ అని గవాస్కర్ తెలిపారు. మరి, ఈయన సూచనని టీమిండియా పాటిస్తుందా? ఇదిలావుండగా.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఈ ఏడాది సీజన్‌లో అరంగేట్రం చేసిన కొత్త గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే! అంతేకాదు, తనవంతుగా హార్దిక్ 487 పరుగులు చేసి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రిషభ్ పంత్ 14 మ్యాచుల్లో చేసింది 340 పరుగులే అయినా.. స్ట్రైక్ రేట్ (151.71) మాత్రం బాగుంది.
కాగా.. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ20 వరల్డ్ అక్టోబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈలోపు టీమిండియా వరుసగా సౌతాఫ్రికా, ఐర్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లతో పొట్టి క్రికెట్ ఆడనుంది. ఈసారి జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఈ ఏడాది ఐపీఎల్‌లో బెస్ట్ ఫినిషర్‌గా నిలిచిన దిశేక్ కార్తీక్‌కీ చోటు దక్కింది. వీళ్లిద్దరి రాకతో భారత జట్టు మరింత బలపడిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.