Team India: ఈనెల 14 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే షమీ, జడేజా లాంటి ప్రధాన ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టులో పలు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసింది. అటు షమీ, జడేజా స్థానాల్లో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్‌లకు అవకాశం కల్పించింది. రోహిత్ ముంబైలో స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లడంతో అతడు తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని.. రెండో టెస్టులో ఆడే విషయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ప్రకటించింది.
Read Also: Health Tips: వయసుతో పాటు బరువు కూడా పెరుగుతున్నారా? అయితే ఇలా చేయండి
మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తొలుత ఈ సిరీస్ కోసం పంత్‌ను బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా నియమించింది. కానీ అతడు ఇటీవల కాలంలో పేలవ ఫామ్ కారణంగా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఆడకపోయినా వైస్ కెప్టెన్ హోదాలో పంత్ జట్టులో స్థానం దక్కించుకుంటున్నాడని పలువురు మండిపడుతున్నారు. దీంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అతడి స్థానంలో సీనియర్ ఆటగాడు చతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రోహిత్ దూరం కావడంతో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది.
తొలి టెస్టుకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, శ్రీకర్ భరత్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ