టీమిండియా మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేరు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. భారత జట్టు 2025 మహిళల ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. స్మృతి వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. 6 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోవాల్సి ఉండగా.. అకస్మాత్తుగా పెళ్లి ఆగిపోయింది. పలాష్‌తో తన వివాహం రద్దయినట్లు తాజాగా స్మృతి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. వివాహం రద్దయ్యాక స్మృతి తొలిసారి బయట కనిపించారు. బుధవారం అమెజాన్ సాంభవ్ సమ్మిట్‌కు హాజరయ్యారు.
అమెజాన్ సాంభవ్ సమ్మిట్‌లో స్మృతి మంధాన మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్ ఎన్నో ఏళ్ల శ్రమ అని చెప్పారు. చిన్నప్పటి నుంచే తనకు బ్యాటింగ్ అంటే పిచ్చి అని, తనను ఎవరూ అర్థం చేసుకోలేదన్నారు. ‘నాకు క్రికెట్ అంటే ప్రాణం. నేను క్రికెట్ కన్నా ఎక్కువగా మారేదాన్ని ప్రేమించలేను. టీమిండియా జెర్సీ ధరించడం ఎంతో ప్రేరణనిస్తుంది. భారత జట్టుకు ఆడడం గొప్ప గౌరవం. చిన్నప్పటి నుంచే నాకు బ్యాటింగ్ అంటే పిచ్చి, ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు. మనసులో మాత్రం ప్రపంచ ఛాంపియన్ అని పిలిపించుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ప్రపంచకప్ మాకు ఎన్నో ఏళ్ల శ్రమ’ అని స్మృతి భావోద్వేగం చెందారు.
Also Read: IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. భారత్ తుది జట్టు ఇదే! గిల్, సూరీడు తప్ప..
‘మా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పినట్లు ఆట పట్ల ప్రేమ ఉండాలి. మనం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. బ్యాటింగ్ చేయడానికి వెళ్లినపుడు మనస్సులో వేరే ఆలోచనలు ఉండకూడదు అనుకుంటా. భారత జెర్సీని ధరించినప్పుడు దేశం కోసం మ్యాచ్‌లు ఎలా గెలవాలి అని మాత్రమే ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ దేశం కోసం మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. దేశం కోసం మ్యాచ్ ఎలా గెలవగలమో ప్రతి ఒక్కరికీ స్వంత అభిప్రాయం ఉంటుంది. జట్టులో చర్చలు, వాదనలు లేకపోతే మనం మైదానంలో గెలవలేము. అందరం మ్యాచ్ గెలవాడనికే మైదానంలోకి దిగుతాం’ అని స్మృతి మంధాన చెప్పుకొచ్చారు.