Simon Taufel Gives Strong Counter Pakistan Fans On Dead Ball Row: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ నవాజ్ వేసిన ‘నో బాల్’పై పాకిస్తాన్ అభిమానులు ఎంత రాద్ధాంతం చేస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. అది ముమ్మాటికీ నో బాల్ కాదని, భారత్ మోసం చేసి గెలిచిందని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లకు షోయబ్ అఖ్తర్ లాంటి ఎంతో అనుభవం ఉన్న మాజీ ఆటగాళ్లు కూడా వత్తాసు పలకడం దారుణం. కేవలం ఒక్క నో బాల్ మీదే కాదండోయ్.. ఆ తర్వాత స్టంప్స్‌కి తగిలిన బంతిని డెడ్‌బాల్‌గా ఎందుకు ప్రకటించడలేదని, ఆ మూడు పరుగుల్ని ఎలా కన్సిడర్ చేస్తారని కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా దిగ్గజ అంపైర్ సైమన్ టాఫెల్ పాకిస్తాన్ ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
‘‘మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా.. భారత్, పాకిస్తాన్ మధ్య చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో.. ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయినప్పటికీ డెడ్‌బాల్ ఎందుకు ప్రకటించలేదని, వాళ్లు తీసిన మూడు పరుగుల్ని బైస్‌గా ఎలా పరిగణిస్తారో వివరించాలని నన్ను చాలామంది అడిగారు. దీనిపై నా సమాధానం ఇదే. బైస్ విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే! ఫ్రీ హిట్ సమయంలో స్ట్రైకర్ బౌల్డ్ అయినా, ఔట్‌గా నిర్ధారించరు. అలాంటప్పుడు దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించే వీలు లేవు. నిబంధనల ప్రకారం.. ఆ బైస్ పరిగణనలోకి వస్తాయి’’ అంటూ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో సైమన్ టాఫెల్ రాసుకొచ్చాడు. దీంతో.. డెడ్‌బాల్ సాగుతున్న చర్చకు ఎండ్ కార్డ్ పడినట్టయ్యింది. కాబట్టి.. పాకిస్తానీయులు ఎంత అక్కసు వెళ్లగక్కినా, ప్రయోజనం లేదు.
ఇంతకీ.. డెడ్‌బాల్ ఎప్పుడు ప్రకటిస్తారు? బ్యాటర్ బ్యాటింగ్‌కి సన్నద్ధమై, బంతి విసిరేందుకు బౌలర్ రెడీగా ఉన్న సమయంలో.. ఏ ఇతర కారణాల వల్ల వికెట్ మీద బెయిల్ కింద పడితే, దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. అలాగే.. బంతి నేరుగా కీపర్ చేదికి వెళ్లినప్పుడు లేదా బౌలర్ చేతికి అందించినప్పుడు కూడా డెడ్‌బాల్ అవుతుంది. అప్పుడు బ్యాటర్లు పరుగులు తీయడానికి వీలు లేదు. నిజానికి బంతి స్టంప్స్‌ను తాకిన తర్వాత అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఫ్రీ హిట్ సమయంలో ఈ నిబంధన వర్తించదు. కాబట్టి.. భారత్ తీసిన ఆ మూడు పరుగులు చెల్లుబాటు అవుతాయి.