Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్‌మన్ గిల్ ఏమ్మన్నాడంటే?

  • భారత్ విజయంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషం
  • విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు
  • వాషింగ్టన్ సుందర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే
Shubman Gill Captain

Shubman Gill Captain

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయంలో తన వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. లక్ష్య ఛేదనలో పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే అత్యంత ముఖ్యమని అన్నాడు. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు టెన్షన్‌కు పోకుండా.. ప్రస్తుతంపై పూర్తిగా దృష్టి పెడుతా అని గిల్ తెలిపాడు. ప్రస్తుతం గురించి ఆలోచించినపుడే విజయాల ఆనందాన్ని, అపజయాల నిరాశను సమతూకంగా ఎదుర్కొనగలమని గిల్ తెలిపాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై శుభ్‌మన్ గిల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. విరాట్ కోహ్లీ మాత్రం బంతిని అద్భుతంగా టైమింగ్ చేస్తూ.. చాలా ఈజీగా ఆడాడు. కోహ్లీ ఆట చూస్తే.. ఏ పిచ్‌పై అయినా బ్యాటింగ్ ఇంత సులువా అని అనిపిస్తుంది’ అని గిల్ చెప్పాడు. బౌలింగ్ విభాగంలో ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంపైనా గిల్ స్పందించాడు. ‘అర్ష్‌దీప్ సింగ్ గత సిరీస్‌లో మంచి ప్రదర్శన చేశాడు. ఆ సిరీస్‌లో మమ్మద్ సిరాజ్ లేడు. ప్రస్తుతం రొటేషన్ విధానాన్ని అనుసరిస్తున్నాము. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఆటగాడికి అవకాశాలు ఇవ్వాలన్నదే మేనేజ్మెంట్ ఆలోచన. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి ఫామ్, ఫిట్‌నెస్‌ను పరీక్షించాల్సిన అవసరం ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

×
×
Ad

Also Read: Washington Sundar: సూపర్ వాషీ.. గాయం బాధిస్తున్నా జట్టు కోసం వచ్చాడు!

వాషింగ్టన్ సుందర్ గాయంపై కూడా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అప్డేట్ ఇచ్చాడు. సుందర్‌కు స్కాన్ చేయాల్సి ఉందని, ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఏదైనా చెప్పగలం అని వెల్లడించాడు. జట్టు అవసరాల కోసం గాయంతోనూ మైదానంలోకి వచ్చిన సుందర్ ధైర్యాన్ని గిల్ ప్రశంసించాడు. మ్యాచ్ మధ్యలో సుందర్ వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. 5వ ఓవర్ అనంతరం నొప్పి ఎక్కువగా ఉండడంతో.. మైదానాన్ని వీడాడు. భారత్ ఛేజింగ్ సమయంలో తన అవసరం పడడంతో క్రీజులోకి వచ్చాడు.