Hetmyer Dropped From West Indies World Cup Squad Over Missed Flight: సాధారణంగా.. కొందరు ఆటగాళ్లు ఫిట్నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అవ్వడం వల్లనో, గాయాల కారణంగానో కొంతకాలం పాటు జట్టుకి దూరం అవుతుంటారు. కానీ.. ఇక్కడ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ షిమ్రన్ హెట్‌మైర్ మాత్రం బద్దకంతో టీ20 వరల్డ్‌కప్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల, మేనేజ్మెంట్ అతడి స్థానంలో మరొకరిని టోర్నీకి పంపింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో భాగంగా.. ఫైనల్లో ఆడిన తలపడిన రెండు జట్లలో షిమ్రన్తో పాటు మరికొందరు వెస్టిండీస్ ఆటగాళ్లు ఉన్నారు. వీరి కోసం వెస్టిండీస్ బోర్డు అక్టోబర్ 1వ తేదీన ఆస్ట్రేలియాకు వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. జట్టులోని మిగతా సభ్యులు కొంచెం ముందుగానే వెళ్లగానే, వాళ్ల కోసం సెపరేట్‌గా ఫ్లైట్ సిద్ధం చేసింది వెస్టిండీస్ బోర్డు. హెట్‌మైర్ మాత్రం వ్యక్తిగత కారణాల రీత్యా అక్టోబర్ 1న వెళ్లలేనని విండీస్ బోర్డుకు తెలిపాడు. ఎంతైనా కీలక ఆటగాడు కాబట్టి.. అక్టోబర్ 3న హెట్‌మైర్‌కు ఫ్లైట్‌ను రీషెడ్యూల్ చేసింది. అంతేకాదు.. ఈసారి ఫ్లైట్ మిస్ కావొద్దని, మిస్ అయితే ప్రపంచకప్‌కు దూరమవ్వాల్సి ఉంటుందని బోర్డు హెచ్చరించింది. అయినా హెట్‌మైర్ రీషెడ్యూల్ ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. కొన్ని కారణాల వల్ల ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాను.. సారీ ఫర్ డిలే అంటూ బోర్డుకి సమాచారం ఇచ్చాడు.
దీంతో బోర్డు కోపం నషాళానికి ఎక్కింది. ఫ్లైట్ రీషెడ్యూల్ చేసినా, ముందుగా హెచ్చరించినా.. ఫ్లైట్ ఎక్కకపోవడంతో హెట్మైర్ను టి20 ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలని నిర్ణయించింది. ప్యానెల్ సభ్యులు కూడా యునానిమస్‌గా ఒప్పుకోవడంతో.. హెట్మైర్ను జట్టు నుంచి తప్పించి, అతని స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. రీషెడ్యూల్ ఫ్లైట్ కూడా మిస్ అయితే జట్టు నుంచి తప్పిస్తామని తాము ముందే హెచ్చరించామని, అతడు రాకపోవడంతో రూల్ ప్రకారం జట్టు నుంచి తప్పించామని డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు. కాగా.. టీ20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల (అక్టోబర్ 5, 7 తేదీల్లో) టీ20 సిరీస్ ఆడనుంది. హెట్‌మైర్ చేసిన పనికి.. బద్దకం వల్లే అతడు వెళ్లలేదన్న విమర్శలు వచ్చిపడుతున్నాయి.