పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదికి బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2025-26లో ఘోర అవమానం ఎదురైంది. నిబంధనలకు విరుద్దుంగా బౌలింగ్ చేయడంతో.. ఫీల్డ్ అంపైర్ అతడిపై చర్యలు తీసుకున్నాడు. ప్రమాదకర బౌలింగ్ కారణంగా.. అఫ్రిది బౌలింగ్‌ను అంపైర్ రద్దు చేశాడు. దాంతో ఓవర్ మధ్యలోనే అతడు బౌలింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం సిమండ్స్ స్టేడియంలో మెల్‌బోర్న్ రెనిగేడ్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెల్‌బోర్న్ రెనిగేడ్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లోని మూడో బంతిని షాహీన్ అఫ్రిది హైఫుల్ టాస్‌గా వేశాడు. బంతి టిమ్ సీఫర్ట్ హెల్మెట్‌కు తాకింది. అంపైర్ నోబాల్ ఇవ్వడంతో పాటు తొలి బీమర్‌గా ప్రకటించాడు. నాలుగో బంతిని ఒలీ పీక్ ఆడగా.. ఆఫ్ సైడ్ ఫుల్ టాస్‌గా అఫ్రిది సంధించాడు. ఈ బంతిని కూడా అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఐదవ బంతిని కూడా హైఫుల్ టాస్‌గా వేశాడు. అంపైర్లు వాటిని ప్రమాదకర బంతులుగా పరిగణించారు. దీంతో షాహీన్ బౌలింగ్‌ను అంపైర్లు నిలిపివేశారు. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీతో మాట్లాడి.. అఫ్రిదిని బౌలింగ్ నుంచి తప్పించారు. ఆ ఓవర్‌లో మిగిలిన రెండు బంతులను కెప్టెన్ మెక్‌స్వీని పూర్తి చేయాల్సి వచ్చింది.
మైదానం విడిచిపోతూ షాహీన్ అఫ్రిది నిరాశతో చిరునవ్వు నవ్వాడు. అతని బీబీఎల్ డెబ్యూ స్పెల్ అక్కడితో ముగిసింది. 2.4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. 18వ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అందులో మూడు నో బాల్స్‌తో పాటు రెండు వైడ్స్ కూడా ఉన్నాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఓ బౌలర్ ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ సందిస్తే అతడిని బౌలింగ్ నుంచి తప్పిస్తారు. మ్యాచ్లో మళ్లీ బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తారు. ఇక మ్యాచ్ రిఫరీ అఫ్రిదిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అతని మ్యాచ్ ఫీజులో కోత పడే ఛాన్స్ ఉంది.
Also Read: BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. రెండు మ్యాచ్‌లు తప్పక ఆడాల్సిందే!
ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ 212/5 భారీ స్కోర్‌ను సాధించింది. టిమ్ సీఫర్ట్ 56 బంతుల్లో 102 పరుగులు చేయగా.. ఒలీ పీక్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. పాకిస్థాన్ మరో స్టార్ మహ్మద్ రిజ్వాన్ నిరాశపరిచాడు. 10 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారీ ఛేదనలో బ్రిస్బేన్ హీట్ 8 వికెట్లకు 198 రన్స్ చేసి 14 పరుగుల తేడాతో ఓడింది. కోలిన్ మున్రో (55), జిమ్మీ పీర్సన్ (50) హాఫ్ సెంచరీలు చేశారు. షాహీన్ అఫ్రిది 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.
Wow.
On his BBL debut, Shaheen Afridi has been removed from the attack! #BBL15 pic.twitter.com/IhDLsKFfJi
— KFC Big Bash League (@BBL) December 15, 2025