అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతితో రాజస్థాన్ రాయల్స్ భంగపాటుకు గురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ సంజు శాంసన్ ఇదే తప్పు చేశాడు. ఫైనల్లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై విమర్శలు చెలరేగాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సంజు శాంసన్ వివరించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. తాము భారీ స్కోరు చేస్తే ప్రత్యర్థి ఒత్తిడికి గురవుతుందని భావించామన్నాడు.
IPL 2022: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ రాజస్థాన్‌కే..!!
ఫైనల్ మ్యాచ్‌లో ఓడినా ఓవరాల్‌గా తమ ప్రదర్శన పట్ల గర్వంగానే ఉందని సంజు శాంసన్ అన్నాడు. ఈ ఓటమితో ఎన్నో విషయాలు నేర్చుకున్నామని.. టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్‌కు అభినందనలు అని తెలిపాడు. ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్లు అద్భుతంగా రాణించారని సంజు శాంసన్ ప్రశంసలు కురిపించాడు. తాము అద్భుతమైన క్రికెట్‌తో అభిమానులను సంతోషపరిచామన్నాడు. టైటిల్ గెలవాలంటే కీలకమైన ఫాస్ట్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యమని టీమ్ మేనేజ్‌మెంట్ భావించిందని.. అందుకే ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్‌ల కోసం చాలా ఖర్చుపెట్టిందని సంజు శాంసన్ అభిప్రాయపడ్డాడు.