Royal Challengers Bangalore Lost The Match By 21 Runs Against Kolkata Knight Riders: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. కేకేఆర్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 179 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. కేకేఆర్ జట్టు 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే అర్థశతకంతో రాణించగా.. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. కొంతలో కొంత లామ్రోర్ పర్వాలేదనిపించాడంతే! స్టార్ బ్యాటర్లు సహా మిడిలార్డర్ కూడా చెత్త ప్రదర్శన కనబర్చడంతో.. ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

IPL Low Scores: ఐపీఎల్ చరిత్రలో నమోదైన 10 అత్యల్ప స్కోర్లు
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (56) అర్థశతకంతో రాణించడం.. కెప్టెన్ నితీశ్ రానా (48) మెరుపు ఇన్నింగ్స్ ఆడటం.. చివర్లో రింకూ సింగ్ (18), డేవిడ్ వీస్ (12) విజృంభించడం.. కేకేఆర్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మొదట్లో విధ్వంసం సృష్టించింది. తొలి రెండు ఓవర్లలో 30 పరుగులు చేసింది. ఓవైపు డు ప్లెసిస్, మరోవైపు విరాట్ కోహ్లీ ఆ రెండు ఓవర్లలో ఎడాపెడా షాట్లతో చెలరేగారు. అది చూసి.. ఆర్సీబీ అత్యంత సునాయాసంగా 201 పరుగుల లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఆర్సీబీకి పెద్ద ఝలక్ తగిలింది. 31 పరుగుల వద్ద ఓ భారీ షాట్ కొట్టబోయి.. డు ప్లెసిస్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే షాబాజ్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. నేను కూడా నీ వెంటే వస్తానంటూ.. మ్యాక్స్‌వెల్ కూడా పెవిలియన్ చేరాడు.
Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 360 మంది భారతీయులు..
అప్పుడు లామ్రోర్‌తో కలిసి విరాట్ కోహ్లీ తన జట్టుని ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. అతనితో పాటు లామ్రోర్ సైతం మెరుపులు మెరిపించాడు. వీళ్లిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 55 పరుగులు జోడించారు. వీళ్ల ఆటతీరు చూసి.. చివరి దాకా ఇన్నింగ్స్ లాక్కొస్తారని, వీళ్లే జట్టుని గెలిపిస్తారనే ఆశలు ఆర్సీబీ అభిమానుల్లో చిగురించాయి. కానీ.. అంతలోనే ఆ ఆశలు ఆవిరైపోయాయి. లామ్రోర్ ఔటైన కొన్ని నిమిషాల్లోనే విరాట్ కోహ్లీ కూడా పోయాడు. అప్పటికే ఓటమి దాదాపు ఖరారైంది. దినేశ్ కార్తిక్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? అని అనుకుంటే.. ఈసారి కూడా నిరాశపరిచాడు. ఇక చివర్లో వచ్చే బ్యాటర్ల పరిస్థితి ఏంటో తెలిసిందేగా!