Rohit Sharma Babar Azam Praises Virat Kohli Innings: చివరివరకూ క్రీజులో నిలబడి భారత్‌ని గెలిపించిన విరాట్ కోహ్లీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా ఆడి.. ఆ ఇద్దరే ఆటని మలుపు తిప్పారని పేర్కొన్నాడు. ‘‘మ్యాచ్ ఫలితం తర్వాత ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మేము ఎక్కువసేపు ఆటలో ఉండేందుకే ప్రయత్నించాం. కానీ, ఇక్కడి పిచ్‌లోనే ఏదో ఉంది. అయితే.. పాక్ జట్టులోని ఇఫ్తికార్, మసూద్ కలిసి చివరివరకు గట్టి పోటీని ఇచ్చారు. వాళ్లు అర్థశతకాలు చేయడంతో, పాక్ ఒక మంచి లక్ష్యాన్ని కుదర్చగలిగింది. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు ఎంతో శ్రమించాల్సిన వస్తుందని మాకు ముందే అర్థమైంది. అయితే.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాత్రం ప్రశాంతంగా రాణిస్తూ, ఆటను మలుపు తిప్పేశారు. మేము గెలిచామనే భావన కన్నా.. ఓడిపోవాల్సిన సమయంలో తిరిగి పుంజుకుని విజయం సాధించడమే మరింత ఆనందాన్ని ఇచ్చింది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక ఇదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాట్లాడుతూ.. ‘‘కొత్త బంతితో ఆడటమనేది అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. బ్యాటింగ్‌లో ఇఫ్తికార్, షాన్ బాగా రాణించారు. అయితే.. భారత్ గెలుపులో క్రెడిట్ అంతా విరాట్‌కే దక్కుతుంది. 80వ దశకాల్లో ఒక్క సిక్స్ బాది మియాందాద్ ఆటను ముగించేవాడు. 2014లో షాహిన్ అఫ్రిది ఇలాగే చేశాడు. ఇప్పుడు మళ్లీ విరాట్, హార్దిక్‌ల భాగస్వామ్యం చివరి ఓవర్లో అద్భుతం చేసింది’’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. భారత్ పనైపోయిందనుకున్న సమయంలో కోహ్లీ మాయాజాలం చేశాడని, స్టేడియం నుంచి ఒక్కరు కూడా లేచి వెళ్లనివ్వకుండా చేశాడని కొనియాడాడు. ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఇన్నాళ్లూ కోహ్లీ ఫామ్‌పై సందేహం వ్యక్తం చేశారు. కానీ, ఫామ్ కన్నా క్లాస్ శాశ్వతమని ఈరోజు కోహ్లీ తన ప్రదర్శనతో నిరూపించాడు’’ అంటూ బాబర్ ఆజం నిరూపించాడు.