ఆసియా పిచ్‌లలో.. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ గెలవడం ఏ జట్టుకైనా అత్యంత చాలా కీలకం. కానీ భారత్ మాత్రం వరుసగా టాస్ ఓడిపోతోంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా టాస్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కూడా టాస్ కలిసిరాలేదు. కోల్‌కతా టెస్టులో సారథి శుభ్‌మాన్ గిల్ టాస్ ఓడగా.. గౌహతి టెస్ట్‌లో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ అయినా టాస్ నెగ్గుతాడు అనుకుంటే అది కూడా జరగలేదు. దాంతో పంత్ కూడా దురదృష్టవంతుడే అని నెటిజెన్స్ అంటున్నారు.
సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌ను గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతడికి ఇదే తొలి టెస్ట్ కెప్టెన్సీ. శుభ్‌మాన్ గిల్ గాయం కారణంగా పంత్‌కు కెప్టెన్‌గా అవకాశం లభించింది. పంత్ భారత్ తరఫున 38వ టెస్ట్ కెప్టెన్. టాస్ రూపంలో పంత్ కెప్టెన్సీకి మంచి ఆరంభం లభించలేదు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ ముందుగా బౌలింగ్ చేస్తోంది. పంత్ టాస్ ఓడిపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే కొంతకాలంగా భారత జట్టును టాస్ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది. ఆ గణాంకాలు చుస్తే మెంటలెక్కిపోవడం పక్కా.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 29 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత్ కేవలం ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే టాస్ గెలిచి.. మిగతా 23 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఫార్మాట్, కెప్టెన్లు మారారు కానీ.. టాస్ అదృష్టం మాత్రం మారలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో టాస్ గెలవలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ శుభ్‌మాన్ గిల్ టాస్ ఓడిపోయాడు. 2025 ఆసియా కప్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు సార్లు టాస్ గెలిచి.. మూడు సార్లు ఓడిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టాస్ ఫలితం 1-1గా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడింది. అందులో హోబర్ట్ టీ20లో మాత్రమే భారత్ టాస్ గెలిచింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ టాస్ ఓడిపోయింది.
Also Read: Ben Stokes Record: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. 1936 రేర్ రికార్డు బ్రేక్!
భారత్ టాస్ గణాంకాలు:
# ఛాంపియన్స్ ట్రోఫీ 2025 – 5 మ్యాచ్‌లలోనూ టాస్ ఓడిపోయింది
# ఇంగ్లాండ్ పర్యటన – 5 టెస్ట్ మ్యాచ్‌లలోనూ టాస్ ఓడిపోయింది
# ఆసియా కప్ 2025 – 4 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచింది, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది
# వెస్టిండీస్ సిరీస్ – 1 టెస్ట్‌లో టాస్ ఓడిపోయింది, 1లో గెలిచింది
# ఆస్ట్రేలియా పర్యటన – 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో టాస్ గెలిచింది
# దక్షిణాఫ్రికా సిరీస్ – రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయింది