తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది దక్షిణాఫ్రికానే. ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు భారత్‌కు వరుసగా రెండో ఓటమి రుచి చూపించారు.
టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైన నేపథ్యంలో కెప్టెన్ రిషభ్ పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రెండో అర్ధ భాగంలో ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేస్తే బాగుండేదన్నాడు. తదుపరి మ్యాచ్‌లోనైనా తప్పులు దిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి అదరగొడుతున్న సంగతి తెలిసిందే. సఫారీ బౌలర్లు విజృంభించడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన భారత్.. బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడంతో పరాజయం పాలైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 2-0తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు.
తాము మరో 10-15 పరుగులు చేయాల్సి ఉండేదని రిషబ్ పంత్ తెలిపాడు. ఇక మొదటి 7-8 ఓవర్లలో భువీ, ఇతర ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని… కానీ, ఆ తర్వాత తాము రాణించలేకపోయామన్నారు.. సెకండాఫ్‌లో వికెట్లు తీయాల్సిన ఆవశ్యకత ఉన్న తరుణంలో తేలిపోయామని పంత్ చెప్పాడు. క్లాసెన్, బవుమా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని… తాము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో! ఇక ఇప్పుడు మేము మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొందని పంత్ వ్యాఖ్యానించాడు.