T20 World Cup 2022: భారీ అంచనాల నేపథ్యంలో ఆదివారం నాడు టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలుత క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. శ్రీలంకపై నమీబియా గెలిచి షాక్ ఇచ్చింది. అక్టోబర్ 22 నుంచి సూపర్-12 రౌండ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో రిజర్వు డేను కూడా ఐసీసీ అమలు చేస్తోంది. ఈ రిజర్వు డేను కేవలం నాకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే ఉపయోగించనున్నారు. వర్షం లేదా వెలుతురు వంటి కారణాలతో మ్యాచ్‌లకు అంతరాయం కలిగితే ఆయా మ్యాచ్‌లను రిజర్వు డే ప్రకారం మరుసటి రోజు నిర్వహించనున్నారు. సెమీఫైనల్, ఫైనల్ వంటి మ్యాచ్‌లలో ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు కూడా ఆడలేని పరిస్థితుల్లోనే రిజర్వు డేను అమలు చేయనున్నారు. రిజర్వు డేలో ముందు రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కొనసాగిస్తారు.
Read Also: Riding Auto on Platform: రైల్వే ప్లాట్‌ఫాంపై ఆటో నడిపాడు.. వీడియో వైరల్, డ్రైవర్ అరెస్ట్
కాగా టీ20 ప్రపంచకప్ కోసం 20 మంది కామెంటేటర్లతో కూడిన జాబితాను ఆదివారం నాడు ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి ముగ్గురు కామెంటేటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఐసీసీ విడుదల చేసిన జాబితాలో ఉన్నారు. మరోవైపు ఇటీవల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్ స్టార్ ఆటగాడు నీల్ ఓబ్రెయిన్, పీటర్ మోమ్సేన్ కూడా కామెంటేటర్ల జాబితాలో ఉండటం గమనించాల్సిన విషయం.