టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. అయితే ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ప్రపంచ కప్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే భారత్ వైఫల్యానికి గల కారణాలపై రవిశాస్త్రి స్పందించాడు. ఆటగాళ్లు కేవలం మనుషులు మాత్రమే అని.. వాళ్లు యంత్రాలు కాదు అని పేర్కొన్నాడు. యంత్రాలలో పెట్రోల్ పోసి నడపొచ్చు.. కానీ మనుషులతో అలా చేయలేం అని.. ప్రపంచకప్‌కు ఏ జట్టు అయినా తాజాగా ఉండాలని కోరుకుంటుందని.. కానీ భారత్ విషయంలో అలా జరగలేదని, టోర్నీకి ముందు ఇంగ్లండ్ సిరీస్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలను నిర్వహించారని.. ప్రపంచకప్‌ను షెడ్యూల్ చేసే ముందు ఐసీసీ ఆలోచన చేసి ఉంటే బాగుండేదని రవిశాస్త్రి అన్నాడు.
Read Also: సారథికి విజయంతో వీడ్కోలు
గత ఐదేళ్లలో భారత్ అద్భుతంగా ఆడిందని రవిశాస్త్రి కితాబిచ్చాడు. గత 70 ఏళ్ల కాలంలో ఏ ఆసియా జట్టు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవలేదని.. కానీ భారత్ మాత్రం వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లను గెలిచిందని గుర్తుచేశాడు. తమ జట్టు ఆస్ట్రేలియాలోనే కాకుండా ఇంగ్లండ్‌లో, దక్షిణాఫ్రికాలోనూ విజయం సాధించిందని తెలిపాడు. కాగా 2017లో రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరింది. అటు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది.