ఐపీఎల్ 2022: ఇటీవల సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. రాజస్థాన్‌తో మంగళవారం రాత్రి జరిగిన పోరులో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు నానా తంటాలు పడింది. చివరకు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. దీంతో 29 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బట్లర్ (8), పడిక్కల్ (7) విఫలమైనా కెప్టెన్ సంజు శాంసన్ (27), ర్యాన్ పరాగ్ (56 నాటౌట్) రాణించారు.
అయితే 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ (9) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ (23) కాసేపు రాజస్థాన్ బౌలర్లను ప్రతిఘటించాడు. అయితే రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బెంగళూరు వికెట్లను టపాటపా పడగొట్టారు. పరాగ్ తరహాలో హసరంగ (18), షాబాజ్ అహ్మద్ (17), రజత్ పటీదార్ (16) ఎవరూ నిలబడలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ 4 వికెట్లతో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. బెంగళూరు మాత్రం 5వ స్థానంలో కొనసాగుతోంది.