Team India: కొంతకాలంగా టీమిండియా పతనం దిశగా సాగుతోంది. ఆటగాళ్ల ప్రదర్శన పక్కనబెడితే తరచూ అందరూ గాయాల బారిన పడుతున్నారు. దీంతో కీలక సిరీస్‌లకు ముఖ్యమైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో టీమిండియా ప్రదర్శన దారుణంగా ఉంటోంది. కొన్నేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో ఊహించుకోవచ్చు. దీనికి కారణం కోచ్, బీసీసీఐ చెత్త నిర్ణయాలే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ మార్పుతో పాటు కొత్త కోచ్ కూడా వచ్చాడు. అయితే కోచ్‌గా టీమిండియాలో సమస్యలను గుర్తించి రాహుల్ ద్రవిడ్ పరిష్కరించలేకపోయాడు. ప్రతి సిరీస్‌కు కెప్టెన్‌ను మార్చడం, ఓపెనర్లను మార్చడం, అలాగే బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చడం వంటి విధానాల వల్ల జట్టు ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Read Also: Selfie Tragedy: రేపే పెళ్లి.. సెల్ఫీ కోసం వెళ్లి లోయలో పడ్డారు
అటు విఫలమవుతున్న ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పిస్తూ ప్రతిభావంతులను రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టడం కూడా టీమిండియా విజయాలపై తీవ్ర ప్రభావం చూపిందని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంలో గ్రెగ్ ఛాపెల్ బాటలో రాహుల్ ద్రవిడ్ వెళ్తున్నాడని పలువురు మండిపడుతున్నారు. 2007 వన్డే ప్రపంచకప్ ముందు ఛాపెల్ భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చాడు. కెప్టెన్‌గా ఉన్న గంగూలీపై వేటు వేశాడు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కూడా కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేశాడు. జట్టులో ఇష్టం వచ్చిన రీతిలో మార్పులు చేస్తున్నాడు. అసలు ఏ ఫార్మాట్‌లో ఏ ఆటగాడు ఉంటాడో తెలియని పరిస్థితికి ద్రవిడ్ నిర్ణయాలే కారణమనే వాదన వినిపిస్తోంది. ఈ కారణంగానే పసికూన బంగ్లాదేశ్‌పైనా సిరీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. రోహిత్ గాయంతో జట్టుకు దూరమైన సమయంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపించకుండా కోహ్లీని పంపించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ద్రవిడ్ నిర్ణయాలు ఇలాగే ఉంటే వన్డే వరల్డ్ కప్ కాదు కదా ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఏదీ టీమిండియా గెలవలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.