Selfie Tragedy: ఓ జంటకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా ఇరుకుటుంబాల వారు కలిసి ఆలయ దర్శనానికి వెళ్లారు. ఆ సమీపంలోని క్వారీని చూసేందుకు వెళ్లి సెల్ఫీ కోసం ఫోజిచ్చారు. ఇంకేముంది వధువు కాలుజారీ లోయలో పడిపోయింది. ఇంతలో వరుడు ఆమెను కాపాడేందుకు దూకేశాడు. కేరళలోని కొల్లాం జిల్లాలో జరిగింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే.. పరవూరుకు చెందిన విను కృష్ణన్కు.. కల్లవుతుక్కల్గ్రామానికి చెందిన శాండ్రా కుమార్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్ 9న ఘనంగా పెళ్లి చేయాలని ఏర్పాట్లు పూర్తి చేశారు పెద్దలు. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు తమ కుటుంబసభ్యులతో గురువారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు.
Read Also: Viral News : పాపం.. ప్రేమగా చూసుకున్న కుక్క కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు
ఆ తర్వాత అక్కడ దగ్గర్లో ఉన్న క్వారీని చూడడానికి అందరూ వెళ్లారు. అదే సమయంలో విని కృష్ణన్, శాండ్ర క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. ఇద్దరూ సెల్ఫీ స్టిల్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే కాలుజారి ఒక్కసారిగా 120 అడుగుల లోతు ఉన్న ఆ లోయలో పడిపోయింది శాండ్ర. వెంటనే వరుడు కూడా ఆమె కాపాడడానికి దూకేశాడు. స్థానికులు, అగ్నిమాపక దళం, పోలీసులు సంయుక్తంగా ఇద్దరినీ రక్షించారు. ఈ ఘటన కల్లువతుక్కల్‌లోని కట్టుపురం అయిరవిల్లి క్వారీ చెరువు వద్ద గురువారం చోటుచేసుకుంది. అనంతరం ఇద్దరినీ పారిపల్లి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముక, కాళ్లకు గాయాలైన సాండ్రాకు మూడు నెలల పూర్తి విశ్రాంతిని ఆస్పత్రి అధికారులు సూచించారు. ఆ తర్వాత పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.