Rahkeem Cornwall Scored Double Century In T20 Cricket: టీ20 క్రికెట్‌లో శతకం సాధించడమంటేనే చాలా కష్టం. కానీ.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మాత్రం ఏకంగా డబుల్ సెంచరీ చేసి, వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. కేవలం 77 బంతుల్లోనే అతడు 205 పరుగులు సాధించాడు. బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని వీరబాదుడు బాదేశాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.
ఆ వెస్టిండీస్ ఆటగాడి పేరు రఖీమ్ కార్న్‌వాల్. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో డాషింగ్ ఓపెనర్‌గా ఇతనికి మంచి పేరుంది. ఇప్పుడు ఇతను అట్లాంటా ఓపెన్ (అమెరికా టీ20 కాంపిటిషన్)లో భాగంగా అట్లాంటా ఫైర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. నిన్న (05-10-22) అట్లాంటా ఫైర్, స్క్వేర్ డ్రైవ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇతడు 77 బంతుల్లోనే 205 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్టు చీల్చి చెండాడి తన బ్యాటింగ్ పవర్‌ను చాటి చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 22 సిక్స్‌లు, 17 బౌండరీలు కొట్టాడు. అంటే.. 200 పరుగుల్ని అతడు వికెట్ల మధ్య పరుగులు తీయకుండానే సాధించాడు. ఇతనితో పాటు స్టీవెన్ టేలర్ (18 బంతుల్లో 53), సామి అస్లామ్ (29 బంతుల్లో 53) విజృంభించడంతో.. అట్లాంటా ఫైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది.
ఇక 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. స్క్వేర్ డ్రైవ్ జట్టులో కార్న్‌వాల్ తరహాలో భారీ షాట్లు ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో.. అట్లాంటా ఫైర్ కుదిర్చిన లక్ష్యంలో సగం పరుగులు కూడా చేయకుండానే చాపచుట్టేసింది. యశ్వంత్ బాలాజీ ఒక్కడే 38 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.