సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అదరగొడుతోంది. శనివారం ఉదయం జరిగిన సెమీఫైనల్‌లో విజయం సాధించి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జపాన్ ప్లేయర్ సీనా కవాకమీపై 21-15, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. సింధు ఈ మ్యాచ్‌ను కేవలం 32 నిమిషాల్లోనే ముగించింది. దీంతో టైటిల్‌కు ఇంకా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది పీవీ సింధుకు ఇదే మొదటిసారి.
Read Also: Sharapova: పెళ్లికాకుండానే మగబిడ్డకు జన్మనిచ్చిన మాజీ స్టార్ ప్లేయర్
కాగా ఈ మ్యాచ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో 38వ స్థానంలో ఉన్న జపాన్ ప్లేయర్ కవకామీపై పీవీ సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనింగ్ గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి కొంత గట్టి పోటీ ఇచ్చినా.. రెండో గేమ్‌లో మాత్రం సింధు ఈజీగా దూసుకువెళ్లింది. 2018లో చైనా ఓపెన్‌లో ఓసారి కవకామీతో సింధు ఆడింది. తాను ఆమెతో తలపడేది రెండో సారే అయినా పీవీ సింధు ఎంతో పరిణితి చూపించి తెలివిగా ఆడింది. ఫోర్‌హ్యాండ్ అటాకింగ్ రిటర్న్స్‌తో పాటు బ్యాక్‌హ్యాండ్ ఫ్లిక్స్‌తో సింధు ఆకట్టుకుంది. కాగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన హాన్ యూను 17-21, 21-11, 21-19 స్కోరుతో పీవీ సింధు మట్టి కరిపించిన సంగతి తెలిసిందే.