Asia Cup 2022: ఈనెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు 10 శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు ముందు కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన పీసీబీ ఇప్పుడు వేతనాలను పెంచడం గమనించదగ్గ విషయం. మొత్తం 33 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టులు పొందగా.. పీసీబీ తాజాగా పెంచిన జీతాల ప్రకారం ఆటగాళ్లందరికి ఓ టెస్ట్ మ్యాచ్ ఫీజు కింద రూ.3.2 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.1.83 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 1.35 లక్షలు ఇవ్వనున్నారు.
అయితే టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే పాకిస్థాన్ ఆటగాళ్ల జీతాలు తక్కువ అనే చెప్పాలి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రెడ్ బాల్ కాంట్రాక్ట్, వైట్ బాల్ కాంట్రాక్ట్ కింద ఆటగాళ్లకు జీతాలు అందిస్తోంది. రెడ్ బాల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ.3.74 లక్షల వేతనం అందివ్వనున్నారు. వైట్ బాల్ క్రికెట్ కాంట్రాక్టర్లకు రూ. 3.42 లక్షల వేతనం ఇవ్వనున్నారు. ఈ రెండు కాంట్రాక్టుల్లో ఉన్నపాకిస్థాన్ ఆటగాళ్లకు లభించే వేతనం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో సి గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ల వేతనంతో సమానం. భారత సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకారం ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సి గ్రేడ్ ప్లేయర్లకు రూ.కోటి చొప్పున వార్షిక వేతనం అందుతోంది. మ్యాచ్ ఫీజుల వారీగా చూసుకుంటే టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3లక్షలు ఇస్తున్నారు.