ICC to Release ODI World Cup 2023 Schedule Today: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను నేడు ఐసీసీ ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మెగా టోర్నీ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ అధికారులు ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రపంచకప్ ప్రారంభ తేదీ (అక్టోబర్ 5)కి సరిగ్గా 100 రోజులు ముందు ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది.
వన్డే ప్రపంచకప్2023కు ఆతిథ్యమిస్తోన్న బీసీసీఐ.. కొద్దిరోజుల ముందే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి పంపింది. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలకు ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీ పంపింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న టోర్నీ ప్రారంభమయి.. నవంబర్ 19న ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ ముసాయిదా షెడ్యూల్‌కు ఇంకా ఐసీసీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఐసీసీ అన్ని దేశాల అభిప్రాయాల మేరకు షెడ్యూల్‌ను సిద్ధం చేసి.. నేడు విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read: Traffic Rules Challan: డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!
ఐసీసీకి బీసీసీఐ పంపిన షెడ్యూల్‌లో పాకిస్థాన్‌కు కొన్ని మ్యాచ్‌ల సమస్య ఎదురైంది. బీసీసీఐతో పలు సమావేశాల అనంతరం షెడ్యూల్ విషయంలో పీసీబీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ఒప్పుకుందని తెలుస్తోంది. అదేసమయంలో ఆస్ట్రేలియాతో బెంగళూరులో, ఆఫ్ఘనిస్తాన్‌తో చెన్నైలో మ్యాచ్‌లు ఆడేందుకు పీసీబీ అంగీకారం తెలిపిందని సమాచారం. చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగవచ్చు.
వన్డే ప్రపంచకప్2023 టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టవచ్చని సమాచారం. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా తొమ్మిది నగరాల్లో భారత్ తన లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. 8 జట్లు ఇప్పటికే అర్హత సాధించగా.. ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫైయర్ ద్వారా రెండు జట్లు ఎంట్రీ ఇస్తాయి.