IND Vs NZ: ఆక్లాండ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 307 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఒక దశలో న్యూజిలాండ్ ఓటమి ఖాయం అనుకున్నారు అభిమానులు. కానీ అనూహ్యంగా లాథమ్ భారీ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ విలియమ్సన్ అతడికి చక్కటి సహకారం అందించాడు. అతడు 98 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అబేధ్యంగా రికార్డుస్థాయిలో 221 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా వికెట్లు తీయలేకపోవడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది.
Read Also: Manjima Mohan : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మలయాళ ముద్దుగుమ్మ
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్‌గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. శిఖర్ ధావన్ 72(77), శుభ్‌మన్ గిల్ 50(65), శ్రేయాస్ అయ్యర్ 80(76) పరుగులు చేశారు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచగా.. చివర్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కేవలం 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరుపున ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ వన్డే అరంగ్రేటం చేశారు. కానీ బౌలింగ్‌లో వాళ్లిద్దరూ విఫలమయ్యారు. కాగా ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యం సంపాదించింది.