Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 రసవత్తరంగా మారింది. పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఇప్పుడు పాయింట్ల టేబుల్ ఆసక్తి రేపుతోంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించడంతో ప్రస్తుతం ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది. శ్రీలంక నెట్ రన్‌రేట్ 0.589గా నమోదు కాగా పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ 0.126గా ఉంది. టీమిండియా నెట్ రన్‌రేట్ మాత్రం -0.126గా, ఆప్ఘనిస్తాన్ నెట్ రన్‌రేట్ -0.589గా ఉంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ పోరులో తలపడతాయి.
గ్రూప్-4లో ప్రతి జట్టు మరో జట్టుతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అంటే ప్రతి జట్టు మూడేసి చొప్పున మ్యాచ్‌లు ఆడాలి. టీమిండియా ఒక మ్యాచ్ ఓడిపోవడంతో ఫైనల్ చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిచి తీరాలి. సెప్టెంబర్ 6న శ్రీలంకతో, సెప్టెంబర్ 8న ఆప్ఘనిస్తాన్‌తో తప్పక గెలవడమే కాకుండా రన్‌రేట్ మెరుగుపరచుకోవాలి. లేదంటే పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో మరో మ్యాచ్ గెలిస్తే ఆ రెండు టీమ్‌లు ఫైనల్‌కు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఒకవేళ టీమిండియా శ్రీలంక, ఆప్ఘనిస్తాన్‌పై నామమాత్రంగా గెలిస్తే మాత్రం సూపర్-4లో చివరి మ్యాచ్ పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడుతుంది.