IND Vs WI: బస్టెర్రె వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. అభిమానులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరింది. మ్యాచ్ జరిగే బస్‌టెర్రెలోని వార్నర్ పార్క్‌కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో అనుకున్న సమయానికి మ్యాచ్ ప్రారంభం కావడం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. అనివార్య పరిస్థితుల కారణంగా ట్రినిడాడ్ నుంచి ఈరోజు మ్యాచ్ జరగనున్న సెయింట్ కిట్స్‌కు ఇరు జట్ల లగేజీ ఆలస్యంగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది.
Read Also: CommonWealth Games 2022: భారత్ ఖాతాలో మరో పతకం ఖాయం
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టీ20లో 68 పరుగుల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఓడించింది. ఇదే జోరులో రెండో టీ20లోనూ గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించి విండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని భారత్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఓపెనర్‌గానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది టీ20ల్లో టీమిండియాకు ఏడో ఓపెనర్‌గా బరిలో దిగిన సూర్యకుమార్ ధాటిగా ఆరంభించిన ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచలేకపోయాడు. దీంతో రెండో మ్యాచ్‌లో అతడినే కొనసాగిస్తారా లేదా పంత్‌ను దించుతారా అన్నది వేచి చూడాలి.