అది 2018.. ఆ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకోవాలంటే, ఆ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ఆశల్ని నీరుగార్చింది.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ, ముంబైను ప్లేఆఫ్స్‌కు వెళ్ళకుండా అడ్డుకుంది. ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఆ ప్రతీకారాన్ని ముంబై తీర్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై సొంతం చేసుకొని, ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశల్ని గల్లంతు చేసింది. ఈసారి ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండడం గమనార్హం. ఐపీఎల్‌లో ఇలాంటి యాదృచ్ఛికమైన ఉదంతం బహుశా ఇదే తొలిసారి చోటు చేసుకుంది.
తొలుత టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ కోసం రంగంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ జట్టులో కేవలం పావెల్ (34 బంతుల్లో 43), పంత్ (39 బంతుల్లో 39) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్మన్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి బౌలర్లలో బుమ్రా (3/25) విజృంభించగా.. 2/32తో రమణ్‌దీప్ కూడా మెరిశాడు. మయాంక్, డేనియల్ చెరో వికెట్ తీశారు. ఇక లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ముంబై.. 5 వికెట్ల నష్టానికి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48), టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34) సత్తా చాటడంతో.. ముంబై ఈ మ్యాచ్‌ని గెలవగలిగింది.
నిజానికి.. ఆరంభంలోనే ముంబైకి గట్టి దెబ్బ పడడం, మధ్యలో ఢిల్లీ బౌలర్లు ముంబై బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెట్టడం చూసి.. ఈ మ్యాచ్ ఢిల్లీనే కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, కీలక సమయంలో ఫీల్డింగ్‌లో జరిగిన తప్పిదాల కారణంగా ఢిల్లీ చేజేతులా మ్యాచ్ ఓడింది. టిమ్ డేవిడ్ తొలి బంతికే ఔటైనా, అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అప్పుడు రివ్యూ తీసుకొని ఉంటే, మ్యాచ్ దశ మారేది. కానీ, పంత్ అనుమానంతో రివ్యూ తీసుకోకపోవడంతో ఢిల్లీ భారీ మూల్యం తీర్చుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోవడంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.