Mahendra Singh Dhoni: ఇండియాలో ఐపీఎల్ టోర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌కు ప్రపంచంలో ఎక్కడ లేనంత క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కూడా ఐపీఎల్ తరహాలో ఓ టోర్నీని నిర్వహించాలని తలపెట్టింది. ఈ మేరకు ఈ టోర్నీలోకి పలు దేశాల స్టార్ ఆటగాళ్లను ఆహ్వానిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జోహన్నెస్‌బర్గ్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీకి ధోనీ మెంటార్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. అయితే బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే ధోనీ మెంటార్ అవతారం ఎత్తడం ఆధారపడి ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు అంటున్నాయి. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు భారత ఆటగాళ్లకు అంగీకారం లభిస్తే ధోనీ కూడా ఆటగాడిగా బరిలోకి దిగుతాడని, అలా కాదని మెంటార్‌గా అవకాశామిస్తే జట్టుకు మార్గదర్శిగా ఉంటాడని సీఎస్‌కేకు చెందిన అధికారి వెల్లడించాడు.
Read Also: Rishabh Pant: అక్క.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలెయ్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై జట్టు కొనుగోలు చేసిన జేబీఎస్‌కే జట్టును డుప్లెసిస్ నడిపించే అవకాశం ఉంది. ఇప్పటికే అతడితో సీఎస్‌కే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ ప్రతిబింబించేలా జోహన్నెస్ బర్గ్ ఫ్రాంచైజీకి జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని బుధవారం సీఎస్‌కే ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా ఈ లీగ్‌లో పాల్గొనే కేప్‌టౌన్ జట్టును ముంబై ఇండియన్స్, సెంచూరియన్, పార్ల్, డర్బన్, పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ ఫ్రాంచైజీ పేరును ఎంఐ కేప్‌టౌన్‌గా నామకరణం చేసింది.