Rishabh Pant Request Urvashi Rautela To Leave Him Alone: క్రికెటర్ రిషభ్ పంత్, నటి ఊర్వశీ రౌతేలా వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే! వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారో లేదో ఎవ్వరికీ క్లారిటీ లేదు కానీ, మీడియాలో మాత్రం తెగ కథనాలు వస్తుంటాయి. నెటిజన్లు సైతం ఈ జోడీపై సోషల్ మీడియాలో ఏదో జోకులు వేసుకుంటూనే ఉంటారు. ఈ ఇద్దరికి సంబంధించి ఏదైనా సందర్భం వస్తే చాలు.. లింక్ పెట్టేసి, నెట్టింట్లో తెగ ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు మీడియా ఊరికే ఉంటుందా? తారస పడినప్పుడల్లా గుచ్చి గుచ్చి ప్రశ్నలు సంధిస్తుంది. ఊర్వశీ రౌతేలాకు రీసెంట్ ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో.. ‘నన్ను ఒంటరిగా వదిలెయ్ అక్క’ అంటూ రిషభ్ పంత్ ఘాటుగానే బదులిచ్చాడు.
ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఏముంది? ‘‘గతంలో వారణాసిలో షూటింగ్ ముగించుకొని, ఒక షో కోసం నేను ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి వచ్చాను. రోజంతా షూట్ చేసి నేను చాలా అలసిపోయాను. అనంతరం రెడీ అవ్వడానికి కాస్త టైం పట్టింది. మీకు తెలిసిందేగా.. అమ్మాయిలు రెడీ అవ్వడానికి సమయం పడుతుందని. అప్పుడే మిస్టర్ ఆర్పీ (RP) నాకోసం వచ్చి, లాబీలో కూర్చున్నారు. కేవలం నన్ను కలవడానికి అక్కడికి వచ్చారు. నేను రెడీ అవుతూ అవుతూ.. అనుకోకుండా నిద్రలోకి జారుకున్నా. షూట్ కారణంగా అలసిపోవడం వల్లే నిద్రపోయా. ఆ సమయంలో నా ఫోన్‌కు చాలా కాల్స్ వచ్చాయి. కానీ, నేను లిఫ్ట్ చేయలేకపోయా. తీరా లేచి చూసిన తర్వాత 16-17 మిస్డ్ కాల్స్ ఉండడాన్ని గమనించాను. అది చూసి నేను చాలా బ్యాడ్‌గా ఫీలయ్యా. నాకోసం ఒకరు వేచి చూస్తుంటే, నేను కలవలేకపోయానన్న విషయం నన్ను కలచివేసింది. దీంతో, ముంబైలో కలుద్దామని ఆర్పీకి చెప్పాను’’ అంటూ ఆ ఇంటర్వ్యూలో ఊర్వశీ తెలిపింది. ఇందులో ఆమె పేర్కొన్న ఆర్పీ మరెవ్వరో కాదు.. రిషభ్ పంత్. దీంతో, ఈ వీడియోని నెటిజన్లు వైరల్ చేసేశారు.
ఇది తన దృష్టికి రావడంతో.. రిషభ్ పంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘పాపులారిటీ కోసం, హెడ్‌లైన్స్‌లో రావడం కోసం కొందరు చేసే దిగజారుడు వ్యాఖ్యలు చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది. ఫేమ్ కోసం మరీ ఇంత తాపత్రయ పడే వాళ్లని చూస్తే జాలేస్తుంది. దేవుడు వారిపై కరుణ చూపించాలని కోరుకుంటున్నా’’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ వేశాడు. అంతేకాదు.. ఈ స్టోరీకి #merapichachorhoBehen (నన్ను ఒంటరిగా వదిలెయ్ అక్క), #jhutkibhilimithotihai (అబద్ధం ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది) అంటూ రెండు క్యాప్షన్లు పెట్టాడు. అయితే.. అతడు పెట్టిన పది నిమిషాల్లోనే ఈ స్టోరీని తొలగించడం గమనార్హం. అయితే.. ఈలోపే ఇది వైరల్ అయిపోయింది. మరి, ఇందుకు ఊర్వశీ రౌతేలా ఎలా బదులిస్తుందో చూడాలి.