మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (Badminton Association) అధ్యక్షుడిగా రెండోసారి కేటీఆర్ ఎన్నికయ్యారు. క్రీడల్లో రాజకీయ నాయకులకు తావు లేదని గతంలో ప్రకటించారు. తాను సైతం బ్యాడ్మింటన్ సంఘానికి రాజీనామా చేస్తానని చెప్పారు కేటీఆర్. కానీ మరొకసారి బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా చాముండేశ్వరినాథ్, జనరల్ సెక్రెటరీగా పుల్లెల గోపీచంద్, ట్రెజరర్ గా పాణీరావు ఎన్నికయ్యారు. ఈ ఎలక్షన్స్ కి శాట్స్, ఒలింపిక్ సంఘాల నుంచి అబ్జర్వర్ గా హాజరయ్యారు ప్రేమ్ రాజ్, నంద గోకుల్. ఆదివారం ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ క్లబ్‌లో ఎన్నికలు జరిగాయి.
రాష్ట్రంలో సమగ్రమయిన క్రీడా పాలసీ రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం, ఇతర క్రీడా సంఘాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఈ సంఘాలు అసలేం చేస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఈ విధానం మారాలంటే క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. ఈ మార్పును నా నుంచే మొదలుపెడతా. త్వరలో బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా రాజీనామా చేస్తా. క్రీడా సంఘాల నిర్వహణలో మాజీ క్రీడాకారులు, క్రీడారంగ నిపుణులకు అవకాశమివ్వాలని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయిన కేటీఆర్ ఏం చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.