Mehidy Hasan Mahmadullah Breaks 17 Years Old Record: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే! కేవలం 5 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే.. ఈ మ్యాచ్‌లో మెహిదీ హసన్, మహ్మదుల్లా ప్రదర్శన మాత్రం ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పుడు.. బంగ్లా జట్టుని ఈ ఇద్దరే ఆదుకున్నారు. ఏడో వికెట్‌కి 148 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న బంగ్లా జట్టుని ఆదుకున్నారు. అత్యల్ప స్కోరుకే చాపచుట్టేస్తుందని బంగ్లా జట్టుకి, భారీ స్కోరుని జోడించారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ పలితంగా.. బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
ఇలా అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి టమ జట్టుని ఆదుకున్న మెహిదీ హసన్, మహ్మదుల్లా.. పలు రికార్డులను బద్దలుకొట్టారు. భారత్‌తో వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన బంగ్లా జోడీగా ఆ ఇద్దరు చరిత్రపుటలకెక్కారు. అంతకుముందు 2014 ఆసియాకప్‌లో భాగంగా అనముల్ హక్, ముష్ఫికర్ రహీమ్ కలిసి 133 పరగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌లో 148 పరుగుల భాగస్వామ్యాన్ని ఆ ఇద్దరు బంగ్లా బ్యాటర్లు నెలకొల్పి.. ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టారు. అలాగే.. భారత్‌పై వన్డేల్లో 7వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగానూ మెహదీ హసన్, మహ్మదుల్లా రికార్డ్ సాధించారు. 2005లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో.. శ్రీలంక బ్యాటర్లు మహేల జయవర్ధనే, ఉపుల్ చందనా కలిసి భారత్‌పై ఏడో వికెట్‌కు 126 పరుగుల పార్ట్నర్‌షిప్ నమోదు చేశారు. ఇప్పటివరకు అదే హయ్యస్ట్ కాగా.. 17 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్‌ను తాజాగా హసన్, మహ్మదుల్లా బద్దలుకొట్టారు.
ఇదే సమయంలో ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మెహదీ హసన్.. తన పేరిట ఒక చారిత్రక రికార్డ్‌ను లిఖించుకున్నాడు. 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. శతకం చేసిన రెండో బ్యాటర్‌గా అతడు రికార్డ్ సాధించాడు. అంతకుముందు 2021లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో.. ఐర్లాండ్ బ్యాటర్ సిమీ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకం బాదాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 266 పరుగులే చేసింది. దీంతో.. ఐదు పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది. ఫలితంగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ బంగ్లా కైవసం అయ్యింది.