Lionel Messi Creates Record In Fifa World Cup: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో మెస్సీ ఒక అద్భుతమైన గోల్ కొట్టడంతో.. అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో మెస్సీ ఇప్పటివరకు మూడు గోల్స్ సాధించగా.. వరల్డ్‌కప్ నాకౌట్ దశలో అతనికిది తొలి గోల్. మరో విశేషం ఏమిటంటే.. ఇది అతనికి 1000వ మ్యాచ్. ఓవరాల్ వరల్డ్‌కప్స్‌లో మెస్సీకి ఇది 9వ గోల్. దీంతో.. వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధికంగా గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు డియేగో మారడోనా, క్రిస్టియానో రొనాల్డో చెరో ఎనిమిది గోల్స్ చేయగా.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ సాధించి, ఆ ఇద్దరి రికార్డులను మెస్సీ పటాపంచలు చేశాడు. అయితే.. అర్జెంటీనా తరపున ఫిఫా కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన వారిలో గాబ్రియెల్ బటిస్టా 10 గోల్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదిలావుండగా.. మెస్సీ, రొనాల్డోలో ఎవరు గొప్ప అనే చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. రొనాల్డో తన 1000వ మ్యాచ్‌ను 2020లోనే పూర్తి చేయగా.. ఇప్పటివరకూ అతడు 725 గోల్స్ సాధించి, మరో 216 గోల్స్‌కు సహకరించాడు. మెస్సీ మాత్రం అతనికంటే ఎక్కువగానే గణాంకాల్ని నమోదు చేశాడు. ఇప్పటిదాకా 789 గోల్స్ చేసి, మరో 348 గోల్స్‌కు సహకారం అందించాడు. ట్రోఫీల పరంగానూ మెస్సీదే పైచేయి. రొనాడ్లో కాతాలో 31 ట్రోఫీలుండగా.. మెస్సీ వద్ద 41 ఉన్నాయి. ఈ రికార్డుల పరంగా చూసుకుంటే.. రొనాల్డో కంటే మెస్సీనే మెరగైనా ఆటగాడిగా చెప్పుకోవచ్చు. కాగా.. ఈ టోర్నీలో సౌదీ అరేబియా చేతిలో పరాజయం చవిచూసిన అర్జెంటీనా, నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియాను ఓడించి, క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ఈ జట్టు నెదర్లాండ్స్‌తో పోరాడనుంది.