ఇండియా ఓపెన్-2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మలేషియా షట్లర్ జీయాంగ్‌పై భారత షట్లర్ లక్ష్యసేన్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడిపోయినా ఆ తర్వాత రెండు, మూడు సెట్లలో సాధికారికంగా ఆడి లక్ష్యసేన్ గెలుపొందాడు. జీయాంగ్‌పై 19-21, 21-16, 21-12 స్కోరు తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు.
కాగా టైటిల్‌పోరులో సింగపూర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కియాన్యూతో లక్ష్యసేన్ తలపడనున్నాడు. లక్ష్యసేన్ ఉత్తరాఖండ్‌కు చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు. అతడి తండ్రి ధీరేంద్ర సేన్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఆటగాడు. అనంతరం ఆయన కోచ్‌గా మారాడు. మరోవైపు లక్ష్యసేన్ అన్న కూడా బ్యాడ్మింటన్ ఆటగాడే కావడం విశేషం. చిన్నతనంలోనే అన్నతో పాటు టోర్నీలకు వెళ్లడం ద్వారా లక్ష్యసేన్‌కు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఏకంగా భారత్ తరఫున సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోతున్నాడు.