Team India: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగేళ్ల కిందట షమీపై అతడి భార్య హసీన్ జహాన్ గృహహింస కేసు పెట్టడంతో పాటు కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. షమీ నుంచి విడిపోవాలనుకుంటున్నానని, తనకు నెలవారీ భరణం ఇప్పించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. హసీన్ జహాన్‌కు నెలవారీగా రూ.50 వేలు భరణం చెల్లించాల్సిందిగా షమీని కోర్టు ఆదేశించింది. గతంలో షమీ తనను హింసించేవాడని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో హసీన్ జహాన్ ఫిర్యాదు చేయడంతో వీరి విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసు నేపథ్యంలో షమీపై నాన్ బెయిలబుల్, హత్యాయత్నం వంటి అభియోగాలు నమోదయ్యాయి. తాను తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారీ షమీ తనను చిత్రహింసలకు గురిచేసేవాడని హసీన్ ఆరోపించింది.
Read Also: Oscars: మరి కొన్ని గంటల్లో నామినేషన్స్ అనౌన్స్మెంట్… అందరి దృష్టి RRR పైనే
అయితే హసీన్ జహాన్ చేసిన ఆరోపణలను షమీ కొట్టిపారేశాడు. అప్పట్లో ఈ ఉదంతం కారణంగా మానసికంగా ఇబ్బంది పడ్డాడు. కొన్నాళ్లు క్రికెట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అయితే తాజా కోల్‌కతా కోర్టు వెల్లడించిన తీర్పుపై హసీన్ జహాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు నెలవారీ ఖర్చుల కింద రూ.10 లక్షల షమీని ఇప్పించాలని కోర్టును కోరింది. ఇందులో రూ.7 లక్షలు తన వ్యక్తిగత ఖర్చుల కోసం కాగా.. రూ.3 లక్షలు తన కూతురు నిర్వహణ కోసం ఇప్పించాలని కోర్టుకు వివరించింది. కానీ న్యాయస్థానం రూ.50 వేలు భరణంతో సరిపెట్టింది. ఈ నేపథ్యంలో అలీపూర్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పును జహాన్ పైకోర్టులో సవాలు చేయనున్నట్టు తెలుస్తోంది.