మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న కోల్‌కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టాపార్డర్ సహా మిడిలార్డర్ బ్యాట్స్మన్లందరూ పెద్దగా ఆశాజనకమైన ప్రదర్శన కనబర్చకపోవడంతో.. కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని మొదట్లో అంతా అనుకున్నారు.
కానీ, రసెల్ రాకతో ఆ ఊహాగానాలన్నీ తారుమారు అయ్యాయి. అప్పటివరకూ కోల్‌కతా బ్యాట్స్మన్లకు ముచ్చెమటలు పట్టించిన హైదరాబాద్ బౌలర్లకు అతడు చుక్కలు చూపించాడు. దీంతో.. 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి, రసెల్ నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు నితీశ్ రానా (16 బంతుల్లో 26 పరుగులు) కూడా దూకుడుగానే రాణించాడు కానీ, భారీ షాట్ కొట్టబోయే ఔట్ అయ్యాడు. సామ్ బిల్లింగ్స్ (29 బంతుల్లో 34 పరుగులు) కూడా పర్వాలేదనిపించాడు. ఎప్పట్లాగే అజింక్యా రహానే మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌దీ అదే పరిస్థితి.
ఇక హైదరాబాద్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమ్రాన్ మలిక్ మరోసారి చెలరేగిపోయాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి, మూడు కీలకమైన వికెట్లు తీశాడు. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సేన్ చెరో వికెట్ తీసుకోగా.. వాషింగ్టన్ సుందర్ మాత్రం భారీ పరుగులు (4 ఓవర్లలో 40) సమర్పించుకున్నాడు. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. ఈ టార్గెట్‌ని చేధిస్తుందా? లేదా? అనేది చూడాలి.