ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఓ పెను సంచలనం. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే ఇతగాడు.. ఇప్పుడున్న ఐపీఎల్ బౌలర్స్‌లోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా చెలామణీ అవుతున్నాడు. ఈ టోర్నీలో ఇతను కనబర్చిన ప్రతిభకు సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. కచ్ఛితంగా ఉమ్రాన్‌కు టీమిండియాలో చోటు దక్కుతుందని క్రీడా నిపుణులే కాదు, మాజీలు సైతం అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
అయితే.. పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మాత్రం ఉమ్రాన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, భారత్‌పై విషయం చిమ్మాడు. ఉమ్రాన్ మాలిక్ ఎంపిక విషయంలో టీమిండియా అతి తెలివిని ప్రదర్శిస్తోందని చెప్పాడు. ‘‘ఒకవేళ ఉమ్రాన్ మాలిక్ పాకిస్థాన్‌లో ఉండి ఉంటే, కచ్ఛితంగా ఈపాటికి జాతీయ జట్టుకు ఎంపికయ్యేవాడు. అతడి బౌలింగ్ సగటు ఎక్కువే ఉన్నప్పటికీ.. బంతుల్లో వేగం ఉంది. వికెట్లు కూడా బాగా తీస్తున్నాడు. ఒకప్పటి స్ట్రైక్ బౌలర్లైన బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ వంటి ఆటగాళ్లు అలాంటి వాళ్లే కద! ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు పేస్ కచ్చితంగా ప్లస్ అవుతుంది. ఇలాంటి టైంలో ఉమ్రాన్‌ని ఎంపిక చేయకుండా.. అతడు పరిణతి పొందేందుకు ఇంకా సమయం కావాలంటూ టీమిండియా తప్పించుకుంటోంది’’ అంటూ అక్మల్ చెప్పుకొచ్చాడు.
గతేడాది ఐపీఎల్‌లోనూ ఉమ్రాన్ ఆడాడని, ఇప్పటికీ పరిణతి చెందాలంటూ సెలెక్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదన్నాడు. ఉమ్రాన్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడన్న విషయం తనకు తెలియదని, కానీ అతని బౌలింగ్‌లో వేగం మాత్రం తగ్గడం లేదన్నాడు. ఇప్పుడు టీమిండియాలో బుమ్రా, ఉమేశ్, షమీ, సైనీ, సిరాజ్ వంటి నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లున్నారు కాబట్టి, ఇలాంటి టైంలో ఉమ్రాన్ ఎంపిక కష్టమేనని అక్మల్ వ్యాఖ్యానించాడు.