Team India: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధానంగా చేసిన మూడు తప్పులే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్‌లు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో జట్టులోకి తీసుకున్న దీపక్ హుడా చేత బౌలింగ్ వేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇస్తున్నా అతడిని గుడ్డిగా నమ్మి ఫుల్ ఓవర్లు వేయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లెగ్ స్పిన్ వేసే దీపక్ హుడా చేత ఎందుకు బౌలింగ్ వేయించలేదని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Virat Kohli: అర్ష్‌దీప్ క్యాచ్ డ్రాప్‌పై కోహ్లీ స్పందన.. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు..!!
మరోవైపు 19వ ఓవర్ అర్ష్ దీప్ సింగ్ చేత కాకుండా భువనేశ్వర్ చేత బౌలింగ్ చేయించి రోహిత్ తప్పు చేశాడని నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు. చివరి 12 బంతుల్లో 26 పరుగులు అవసరం కాగా భువనేశ్వర్ ఒక్కడే 19 పరుగులు ఇచ్చి పాకిస్థాన్ పని సులువు చేశాడని.. అదే 19వ ఓవర్ అర్ష్‌దీప్ చేత వేయించి 20వ ఓవర్ భువనేశ్వర్ చేత వేయించి ఉంటే బాగుండేదని సూచిస్తున్నారు. ఇప్పటికైనా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాపై అతి నమ్మకం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అసలు దీపక్ హుడా ఎంపిక సరికాదని.. తర్వాతి మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను తీసుకుని బౌలింగ్‌ను బలోపేతం చేయాలని కోరుతున్నారు.