ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ గడ్డపై ఆశ్చర్యకర రీతిలో వన్డే సిరీస్ విజయాన్ని సాధించింది. సబీనా పార్కులో ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై రెండు వికెట్ల తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో వెస్టిండీస్ గెలవగా… రెండు, మూడు వన్డేల్లో ఐర్లాండ్ గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా విదేశీ గడ్డపై తొలిసారి ఐర్లాండ్ వన్డే సిరీస్ గెలిచింది.
Read Also: ఐపీఎల్ 2022: ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా
ఆదివారం జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య విండీస్‌ను 212 పరుగులకే ఆలౌట్ చేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో హోప్(53) అర్ధ సెంచరీతో రాణించగా.. హోల్డర్ 44 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్‌బ్రిన్ 4 వికెట్లు సాధించగా.. యంగ్ మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. విలియం పోర్ట్ ఫీల్డ్ డకౌట్ కాగా మరో ఓపెనర్ కెప్టెన్ పార్ల్ స్టిర్లింగ్ మాత్రం 44 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండర్ ఆండీ మెక్‌బ్రిన్ బ్యాటింగ్‌లోనూ రాణించి 59 పరుగులతో సత్తా చాటాడు. అతడికి టెక్టార్ (52) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ రాణించడంతో ఐర్లాండ్ రెండు వికెట్లు ఉండగానే గెలిచి చరిత్ర సృష్టించింది.