Travis Head Hails Bhuvneshwar Kumar Bowling: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19 ఓవర్ చివరి బంతికి సిక్సర్ ఇచ్చి తమని నిరుత్సాహానికి గురిచేశాడని ఓపెనర్ ట్రావిస్ హెడ్ తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ క్లాసిక్ బౌలింగ్‌తో అదరగొట్టాడని ప్రశంసించాడు. నితీశ్ రెడ్డి చూడచక్కని షాట్లతో అలరించాడని హెడ్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 రన్స్ అవసరం కాగా.. 19 ఓవర్ వేసిన కమిన్స్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొదటి బంతికి వికెట్ తీసిన అతడు.. మిగతా నాలుగు బంతుల్లో ఒకే రన్ ఇచ్చాడు. అయితే చివరి బంతికి పావెల్ సిక్సర్ బాది సన్‌రైజర్స్ జట్టుపై ఒత్తిడి పెంచాడు.
రాజస్థాన్ రాయల్స్ విజయానికి 20వ ఓవర్‌లో 13 అవసరం కాగా.. భువనేశ్వర్ కుమార్ అద్భుత బంతులు వేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. వికెట్ తీసి హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దాంతో సన్‌రైజర్స్ ప్లేయర్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ… ‘ఇది అద్భుత విజయం. ఈ గెలుపును మేం అస్సలు ఊహించలేదు. ఎవరూ ఇలాంటి ముగింపును ఊహించరు. కమిన్స్, భువీ తమ క్లాస్‌ని ప్రదర్శించి మాకు మంచి విజయాన్ని అందించారు. నటరాజన్ అద్భుతమైన బౌలింగ్‌తో మమ్మల్ని రేసులోకి తెచ్చాడు’ అని అన్నాడు.
‘మేము బాగా ఆడుతున్నాము. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడాం. ఈ విజయంతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ పిచ్‌పై ప్రతి ఓవర్ సవాల్‌తో కూడుకున్నదే. కమిన్స్ 19వ ఓవర్ చివరి బంతికి సిక్స్ ఇవ్వడంతో మేం నిరుత్సాహానికి గురయ్యాం. చివరి బంతికి భువీ మ్యాజిక్ చేశాడు. గెలుపుపై చాలా సంతృప్తిగా ఉంది. 200 ప్లస్ స్కోరు ఇక్కడ మంచి లక్ష్యమే. నితీశ్ రెడ్డి మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు అతడు గతంలోనూ ఆడాడు. ఇది కఠినమైన పిచ్. తొలుత బ్యాటింగ్ చేయడానికి కష్టంగా అనిపించింది. టీ20 క్రికెట్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఏదేమైనా సొంత మైదానంలో విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చింది’ అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.