Hardik Pandya React on Mumbai Indians Defeats in IPL 2024: ఐపీఎల్ 2024లో తాము క్వాలిటీ క్రికెట్ ఆడలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒప్పుకున్నాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. నాణ్యమైన క్రికెట్‌ను ఆడటంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఇలాంటి ముగింపును తాము అస్సలు కోరుకోలేదని చెప్పాడు. పొరపాట్లను సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం అని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై .. కేవలం నాలుగు విజయాలు, 10 ఓటములతో పాయింట్ల పట్టికలో పదో స్థానంతో ఐపీఎల్ 2024ను ముగించింది.
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘ఈ ఓటములను జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇలాంటి ముగింపును మేం కోరుకోలేదు. టోర్నీలో మేం క్వాలిటీ క్రికెట్ ఆడలేదు. ఇది ఒప్పుకోవాల్సిందే. ఇదే మమ్మల్ని రేసులో లేకుండా చేసింది. క్రికెట్‌లో ఇలాంటివి అన్ని సహజమే. ఎప్పుడూ కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాలి. కానీ మేం జట్టుగా క్వాలిటీ క్రికెట్, స్మార్ట్ క్రికెట్ ఆడలేకపోయాము. ఎక్కడ పొరపాట్లు జరిగాయో ఇప్పుడు చెప్పడం కష్టం. తప్పకుండా అన్నిటిని సరిదిద్దుకొని బలంగా ముందుకొస్తాం’ అని తెలిపాడు.