Hero Satya Dev on Ambati Rayudu: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ సినిమా మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో సత్యదేవ్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.
మీకు ఎవరి బయోపిక్ తీయాలనుందని సత్యదేవ్‌ను ఓ రిపోర్టర్ అడగ్గా.. భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అని టక్కున చెప్పేశాడు. అంబటి రాయుడు అంటే తనకు చాలా ఇష్టం అని, అతడి బయోపిక్ తెరకెక్కే అవకాశాలు ఉంటే అందులో తనకు నటించాలనుందని తెలిపాడు. రాయుడు భారత్ తరఫున 5 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1736 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రాయుడు 204 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4348 పరుగులు చేశాడు.
Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
కృష్ణమ్మ గురించి సత్యదేవ్ మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో ఎలాంటి రాజకీయాన్ని చూపించలేదు. మీకు విజయవాడ కొత్తగా కనిపిస్తుంది. నేను ఆశిస్తున్న ఫలితాన్ని కృష్ణమ్మతో అందుకుంటాననే నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని తెలిపాడు. గాడ్ ఫాదర్ సినిమాలో విలన్‌గా నటించడం తనకు ప్లస్సే అని చెప్పాడు. అప్పటివరకూ తాను చేసిన పాత్రలు ఒకెత్తైతే.. గాడ్ ఫాదర్ రోల్ మరో ఎత్తని పేర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయడమంటే నటుడిగా మరో మెట్టు ఎక్కినట్టే అని సత్యదేవ్ అభిప్రాయపడ్డాడు.