Irfan Pathan Feels Hardik Pandya Hitting ability going down: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. హార్దిక్ సేన ఈ సీజన్‌లో ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్‌లు గెలవాలి. ప్రస్తుత ముంబై ఫామ్ చూస్తుంటే 6 మ్యాచ్‌ల్లో గెలవడం దాదాపు అసాధ్యమే. ఏవైనా సంచనాలు నమోదైతే తప్ప ముంబై ప్లేఆఫ్స్ చేరదు. అయితే కెప్టెన్సీ మార్పు, కొత్త ఆటగాళ్ల రాక ముంబై జట్టుపై ప్రభావం చూపిందని చెప్పాలి.
రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ గెలవగా.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కనీసం ప్లేఆఫ్స్ చేరే అవకాశం కూడా లేదు. హార్దిక్ కెప్టెన్సీలో మాత్రమే కాదు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా కేవలం 4 వికెట్స్ మాత్రమే పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 151 రన్స్ మాత్రమే చేశాడు. భారీ షాట్స్ కూడా ఆడడం లేదు. ఈ నేపథ్యంలో హార్దిక్ పనైపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.
Also Read: Hardik Pandya: హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్!
‘హార్దిక్ పాండ్యా హిట్టింగ్ సామర్థ్యం తగ్గిపోతోంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. భారత క్రికెట్‌కు ఇది మంచిది కాదు. వాంఖడేలో హార్దిక్ భిన్నంగా ఉంటాడు. అక్కడ బాగానే ఆడుతాడు. అయితే బ్యాటింగ్‌కు తక్కువగా అనుకూలించే పిచ్‌లపై ఇబ్బంది పడుతున్నాడు. ఇది అతడిని ఇబ్బందుల్లోకి నెడుతుంది’ అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇర్ఫాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.