Ravindra Jadeja IPL Record for CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 16 అవార్డులు ఉన్నాయి. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా (46; 26 బంతుల్లో, 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా.. ఆపై 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Covishield: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళన.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..
అంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ ఇప్పటివరకు 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (11), మైకేల్ హస్సీ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జడేజా మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో 40కి పైగా పరుగులు, మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధికసార్లు సాధించిన ఆల్‌రౌండర్ల జాబితాలో షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్‌లతో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఘనతను ఈ వీరు మూడుసార్లు సాధించారు.