Virat Kohli Statue installed at Jaipur Wax Museum: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. గురువారం (ఏప్రిల్ 18) జైపూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ‘కింగ్’ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ తెలిపారు. 35 కిలోల బరువున్న భారత మాజీ కెప్టెన్ మైనపు విగ్రహం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. కోహ్లీ విగ్రహాన్ని తయారు చేసేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టింది.
జైపూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో ఉన్న విరాట్ కోహ్లీ మైనపు విగ్రహా సందర్శనకు నేటి నుంచి అభిమానులకు అనుమతి ఇచ్చారు. దాంతో విరాట్ మైనపు విగ్రహాన్ని చూసేందుకు ఫాన్స్ ఎగబడుతున్నారు. ఆర్‌సీబీ వరుస పరాజయాల వేళ కోహ్లీ అభిమానులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. నహర్‌ఘర్ కోట ప్రాంగణంలో ఉన్న వ్యాక్స్ మ్యూజియంలో ఇప్పటికే 44 మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ల విగ్రహాలు ఉన్నాయి.
Also Read: T20 World Cup 2024: ఆ ఆటేంది.. కొంచెం యశస్వి జైస్వాల్‌తో మాట్లాడండి!
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 72.20 సగటు, 147.35 స్ట్రైక్ రేట్‌తో 361 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ తన ఎనిమిదో ఐపీఎల్ శతకం రాజస్థాన్ రాయల్స్‌పై చేసిన విషయం తెలిసిందే. ఆరెంజ్ క్యాప్ జాబితాలో విరాట్ అగ్రస్థానంలో ఉండగా.. ఐపీఎల్ 17వ ఎడిషన్ పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ అట్టడుగున ఉంది. ఏడు గేమ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఒక విజయం మాత్రమే సాధించింది. ఏప్రిల్ 21న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. ఐదు పరాజయాలను చవిచూసిన ఆర్‌సీబీ.. తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది.