Big Relief for RCB Fans: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు ( డిసెంబర్ 7న) ప్రకటించారు. అయితే, 2024 జూన్ 4వ తేదీన ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదని ప్రచారం జరిగింది. కానీ, డిప్యూటీ సీఎం క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది.
అయితే, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే ఒక పెద్ద కొత్త స్టేడియాన్ని కూడా నిర్మించే ప్రణాళిక ఉందని తెలిపారు. నేను క్రికెట్ అభిమానిని.. కర్ణాటకలో జరిగిన ప్రమాదం మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం.. బెంగళూరుకు గౌరవం దక్కేలా చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ఈవెంట్లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మైదానం పూర్తిగా కేఎస్సీఏ ఆధ్వర్యంలో నడుస్తుందని స్పష్టం చేశారు.
Read Also: IndiGo Refund Rs.610 Crore: ఇండిగో ప్రయాణికులకు రూ. 610 కోట్లు రీఫండ్..
ఇక, చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రసక్తే లేదు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. అన్ని మ్యాచ్ లను ఈ స్టేడియంలోనే కొనసాగిస్తాం.. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవం.. దాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. మహిళల మ్యాచ్‌ల గురించి ప్రశ్నించగా, వారికి తగిన అవకాశాలు ఇవ్వడం మా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు.