ఐపీఎల్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. వరల్డ్‌వైడ్‌గా పేరుగాంచిన ప్రముఖ క్రికెటర్లు ఈ లీగ్‌లో భాగం అవుతారు. అందుకే, ఈ లీగ్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు ఎగబడతారు. అంతటి క్రేజ్ కలిగిన ఈ లీగ్ ప్రసార హక్కులకు డిమాండ్ మామూలుగా ఉంటుందా? వేల కోట్లు దాటాల్సిందే! ఈసారి ఐపీఎల్ ప్రసార (టీవీ, డిజిటల్) హక్కులైతే హిస్టారికల్ రేటుకు అమ్ముడుపోయాయి.
ముంబై వేదికగా బీసీసీఐ ఈ-వేలం నిర్వహించగా.. జియో, స్టార్, సోనీ తదితర దిగ్గజ కంపెనీలో పోటీపడ్డాయి. చివరకు టీవీ, డిజిటల్ హక్కులు కలుపుకొని అక్షరాలా రూ. 44,075 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్యాకేజ్ ఏలో టీవీ హక్కులు, ప్యాకేజ్ బీలో డిజిటల్ హక్కులను బీసీసీఐ అమ్మకానికి పెట్టగా.. ప్యాకేజ్ ఏను సోనీ సంస్థ రూ. 23, 575 కోట్లకు, ప్యాకేజ్ బీను జియోకు చెందిన వయాకామ్18 సంస్థ రూ. 20,500 కోట్లకు సొంతం చేసుకున్నాయి. 2023 నుంచి 2027 వరకు.. మొత్తం ఐదేళ్ళ కాలానికి నిర్వహించిన వేలంలో రెండు ప్యాకేజీలకు కలిపి బీసీసీఐ బేస్ ధరను 33,340 కోట్లుగా నిర్ణయించగా, వేలం పాటలో ఆ ఫిగర్ రూ. 44,075 కోట్ల వరకు వెళ్లింది.
బేస ధర కంటే దాదాపు పది వేల కోట్ల రూపాయలు అధికంగా రావడంతో.. బీసీసీఐకి కాసుల పంట పండినట్లయ్యింది. ఈ లెక్కన.. ఒక్కో మ్యాచ్ ప్రసారం విలువ రూ. రూ.107.5 కోట్లు అన్నమాట! కాగా.. అంతకు ముందు 2008లో సోనీ పిక్చర్స్ ఐపీఎల్ ప్రసార హక్కులను పదేళ్ల కాలానికి గానూ రూ. 8,200 కోట్లకు దక్కించుకుంది. 2017-2022 మధ్య ఐపీఎల్ (IPL) మీడియా హక్కులను స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్లకు దక్కించుకుంది.