ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో భారత బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. మొదటి రెండు రౌండ్‌లలో అమ్ముడుపోని పృథ్వీ షాను.. అతడి మాజీ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ మూడో రౌండ్‌లో కొనుగోలు చేసింది. కనీస ధర రూ.75 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది. మూడో రౌండ్‌లో అతడి పేరు రాగా.. ఢిల్లీ బిడ్ వేసింది. మరే ప్రాంచైజీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో అతడు ఢిల్లీ సొంతమయ్యాడు. ఐపీఎల్ 2025 వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే.
Also Read: IPL 2026 Auction: ముగిసిన ఐపీఎల్ 2026 వేలం.. అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ వీరే!
ఐపీఎల్‌లో పృథ్వీ షా తుఫాన్ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. 2024 సీజన్ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఆ మధ్య ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా అతడిని పక్కన పెట్టింది. ఆపై ఛాన్స్ ఇవ్వగా.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి 19వ సీజన్ కోసం పేరు నమోదు చేసుకున్నాడు. వేలం మొదలైన కాసేపట్లోనే పృథ్వీ పేరు వచ్చినా.. ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. రెండో రౌండ్‌లో కూడా ప్రాంఛైజీలు కొనలేదు. మూడో రౌండ్‌లో ఢిల్లీ కనికరించింది. పృథ్వీ షా 2018లో భారత జట్టు తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు. జట్టులోకి ఎంత వేగంగా వచ్చాడో.. అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు.