IPL 2023: కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ బోసిపోయింది. మ్యాచ్‌లన్నీ ఒకే చోట లేదా పరిమిత స్టేడియాలలో నిర్వహిస్తుండటం వల్ల ఐపీఎల్ కళ తప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2023 సీజన్‌ను హోమ్ అండ్ అవే పద్ధతిలో నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. అంతేకాకుండా 2023 సీజన్ కోసం బీసీసీఐ మినీ వేలం ప్రక్రియను నిర్వహించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 16న బెంగళూరు వేదికగా ఐపీఎల్ మినీ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సందర్భంగా ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ.90 కోట్ల నుంచి రూ.95 కోట్లకు పెంచనున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో జట్లు ఎక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. ఈ విషయాన్ని ఈనెల 18న జరిగే వార్షిక సమావేశంలో బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.
Read Also: T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి
కాగా మినీ వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న జడ్డూ.. వచ్చే సీజన్‌లో ఫ్రాంచైజీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే జడేజా, చెన్నై మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఐపీఎల్-15లో అతడికి సారథ్యం కట్టబెట్టి మధ్యలోనే తొలగించడంతో జడేజా కినుక వహించాడు. ఈ నేపథ్యంలో జట్టు నుంచి బయటకు వచ్చి మినీ వేలంలో పాల్గొనాలని భావిస్తున్నాడు. దాంతో మినీ వేలంలో జడేజాకు భారీ ధర పలికే అవకాశం ఉంది. జడేజాతో పాటు ఈ మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అదృష్టవంతులు ఎవరు కానున్నారో వేచి చూడాల్సిందే.