ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అనూహ్య విజయాలతో లక్నో దూసుకువెళుతోంది. లీగ్ లోకి పసికూనగా ప్రారంభించిన లక్నో ప్రస్థానం అప్రమతిహతంగా సాగుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ సూపర్ కింగ్స్ మరోసారి అపజయం మూటగట్టుకుంది. బలమైన బ్యాటింగ్ లైన్ కలిగి ఉన్న పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. దీంతో 113 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్ బౌలర్లు రాణించి 153 పరుగులకే లక్నోను కట్టడిచేశారు. అయితే, బ్యాటర్లు మరోమారు చేతులెత్తేశారు.
ఈ మ్యాచ్ లో బెయిర్‌స్టో చేసిన 32 పరుగులే జట్టులో వ్యక్తిగత అత్యధిక స్కోరు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 25, రిషి ధావన్ 21, లియామ్ లివింగ్ స్టోన్ 18 పరుగులు చేశారు. ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి విజయానికి 21 పరుగుల దూరంలో పంజాబ్ ఆగిపోయింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 3, దుష్మంత చమీర, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
IPL 2022 : ముగిసిన ఎల్‌ఎస్‌జీ బ్యాటింగ్.. పంజాబ్ లక్ష్యం 154
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. కగిసో రబడ బంతితో నిప్పులు చెరగడంతో లక్నో వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. అయితే, క్వింటన్ డికాక్ (46), దీపక్ హుడా (34) రాణించారు. చివర్లో చమీర 17, మోసిన్ ఖాన్ 13 పరుగులు చేయడంతో లక్నో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. పంజాబ్ బౌలర్లలో రబడ 4 వికెట్లతో లక్నో జట్టును హడలెత్తించాడు. రాహుల్ చాహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఎల్‌ఎస్‌జీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో లక్నో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో వుండగా.. రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో రెండవ స్థానంలో వుంది. పంజాబ్ ఐదు ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి.