క్రీడాప్రియులు ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2022 తుది సమరం జరగనుంది. రసవత్తరంగా మారిన ఐపీఎల్ పోరు ఫైనల్ లో తలపడనున్నాయి రాజస్థాన్-గుజరాత్. ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది గుజరాత్ టైటాన్స్. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కి ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో సినీ ప్రముఖులతో పాటు ప్రముఖులు సందడి చేయబోతున్నారు. ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు.
ఈ టైటిల్ పోరుకి ముందు ముగింపోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో పాటూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, కొరియో గ్రాఫర్ నీతిమోహన్ కూడా పాల్గొంటారు.ఏఆర్ రెహమాన్, నీతి మోహన్ తమ టీమ్‌లతో కలిసి శనివారం అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా చేశారు.నరేంద్ర మోడీ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 1,32,000కాగా.. ఈరోజు ఫైనల్ మ్యాచ్‌కి 1,25,000 మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
IPL 2022 ముగింపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2020, 2021 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరిగాయి. వాటికి ముగింపు వేడుకలు నిర్వహించలేదు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ స్టేడియంలో కార్యక్రమానికి హాజరయిన సంగతి తెలిసిందే. 2020 వరకూ 90 వేల సీటింగ్ సామర్థ్యంతో ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అతి పెద్ద క్రికెట్ స్టేడియం, అయితే తాజాగా ఆ రికార్డ్ ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియం స్వంతమయింది. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ పై భారీగానే బెట్టింగ్ లు జరుగుతున్నాయి.
IPL 2022: నేడే ఐపీఎల్ ఫైనల్.. గుజరాత్, రాజస్తాన్ మధ్య టఫ్ ఫైట్