IND Vs SA: గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారీ స్కోరు చేయడంతో టీమిండియా బతికిపోయింది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ విజయపు అంచుల వరకు తీసుకువెళ్లాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 16 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ముఖ్యంగా మిల్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో మిల్లర్ 106 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. అతడికి ఓపెనర్ డికాక్ సహకారం అందజేశాడు. డికాక్ 48 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 69 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 174 పరుగులు జోడించారు.
Read Also:IND Vs SA: వన్డే సిరీస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
చివరి 10 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు టీమిండియాదే అని స్పష్టమైనా దక్షిణాఫ్రికా అభిమానుల్లో ఆశ ఉందంటే దానికి కారణం మిల్లర్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఆఖరి ఓవర్‌లో 37 పరుగులు చేయాల్సిన దశలోనూ మిల్లర్ తగ్గలేదు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే సెంచరీ ఆనందం మిగిలినా అతడికి గెలుపు మాత్రం అందలేదు. టీమిండియా బౌలర్లలో దీపక్ చాహర్ మినహాయించి మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసినా 62 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా ఓ వికెట్ సాధించినా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. కాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కేఎల్ రాహుల్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో నామమాత్రపు చివరి టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.